27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మళ్ళీ అలా ఎవరు పాడతారయ్యా..!

 


                          డిచిన రెండు రోజులు నుంచి ఒకటే ఆవేదన. అన్నమయ్య సినిమా పతాక సన్నివేశమే కళ్లలో మెదులుతున్నట్టుంటుంది. అందులో భగవంతుడికీ.. భక్తునికీ మధ్య జరిగే సంభాషణ.. సంఘర్షణ ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళుతుంది. ఇదిగో స్వామీ నీ సొత్తు... "దాచుకో... నీ పాదాలకు ధరణే చేసిన పూజలివి..పూచీ.. నీ కీరితి ధూప పుష్పములివె అయ్యా.. దాచుకో..దాచుకో..! " అంటూ అన్నమయ్య సమర్పించిన భక్తి పుష్పాలను స్వీకరిస్తూ.. స్వామి అడుగుతారు.. దాచుకుంటానులే కానీ!  ఏవిటీ.. అప్పుడే లెక్కలప్పజెబుతున్నావ్.. అని. దానికన్నమయ్య "అప్పుడే ఏమిటి స్వామీ..! ఈ కట్టే పుట్టి తొంభై రెండేళ్ళు గడిచిందంటాడు.. దానికి స్వామి "అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి.. మాలాగ నిత్యం యవ్వనంతో ఉండేలా వరమనుగ్రహిస్తాం అంటారు.  దానికన్నమయ్య.. నటనా సూత్రధారి..! పరమపద సోపానపు ఆటలో.. ఆశల నిచ్చెనలు ఎక్కించడం.. కోర్కెల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే .. హా! ఇంకా ఈ దేహం పై మోహం ఉందా.. లేదా.. అని పరీక్షిస్తున్నావ్  కదూ అంటే. స్వామి కాదు..  నీ పాట మీద మాకున్న వ్యామోహం.. నువ్వెళ్ళిపోతే మళ్ళీ అలా ఎవరు పాడతారయ్యా.. అని అంటారు..  సరిగ్గా ఇలాంటి సంవాదమే భగవంతుడికీ.. బాలూగారికీ జరిగి చివరికి బాలూగారే జయించి వెళ్ళిపోయుంటారు... 

             " కొత్తనీటి రాక.. పాతనీటి పోక " ఏ రంగంలో అయినా తప్పదు. అయితే తరాలు మారుతూ ఉంటాయి.. విధానాలు మారుతుంటాయి. పోయే తరానికి.. వచ్చే తరానికి మధ్య వారధిలా ఉండి, తమ అనుభవాలనూ.. జ్ఞాపకాలనూ..అటు పెద్దరికంగా.. ఇటు స్నేహపూర్వకంగా.. పంచుకునేవాళ్ళు చాలా తక్కువమందుంటారు. బహుశా..!  అలాంటివారిలో బాలూగారు ముందువరుసలో ఉంటారనుకుంటా. అవును, పాశ్చాత్యపు పోకడలు సినీ సంగీతంలో మొలకెత్తినప్పటి నుండీ ఆయన సినీ పాటలు పాడటం తగ్గించి.. అడపాదడపా పాటలు పాడినా, ఆయన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు అనిపిస్తుంది ఆయన జీవనచిత్రాన్ని చూస్తే..! కొన్ని మాటలు ఆయన నోటితో చెబితేనే బాగుంటుంది.. కొన్ని పాటలు ఆయన స్వరంలో వింటేనే బాగుంటుంది. ఆయన టీవీలో కనిపించే కార్యక్రమం ఏదైనా ఆయన కోసమే విక్షంచాలనిపించేది

                   స్వరాభిషేకం కార్యక్రమం విజయం మొత్తం బాలూగారికే సొంతం. పాడుతూ తీయగా ద్వారా ఎందరో గాయనీ గాయకులను తయారుచేసి.. తనకన్నం పెట్టిన సంగీత సరస్వతి రుణం తీర్చుకున్నారేమో. ఆయన తన తరువాత తరానికి సంగీతంతో పాటు.. సంస్కారాన్ని.. మర్యాదను నేర్పించారు. నిజానికి ఈ నిష్క్రమణం బాలూగారిది కాదు.. తెలుగు భాషది.. ఎందుకంటే తన పాటలతో కొన ఊపిరితో ఉన్న తెలుగు భాషకు ప్రాణం పోశారు బాలూగారు . అంత స్పష్టమైన ఉచ్ఛారణ.. పాటలో భావ ప్రకటన ఉన్న గాయకులు ఇక లేరనడంలో అతిశయోక్తి లేదేమో. ఆయన పాటలున్నంత కాలం.. వినపడినంత కాలం.. తెలుగు  భాష బ్రతికే ఉంటుందని ఆశిద్దాం.. బాలూగారికి నివాళులర్పస్తూ.. 

                   

5, జులై 2020, ఆదివారం

స్నేహగీతం

నా ఊహల పూదోటలో..

  అక్షరాల పూలు రాలుతున్నాయి..

మధురమైన మన చెలిమికి..

  మనోహర కవితలల్లమన్నాయి.. 

కోకొల్లలైన పూరేఖులలో

  పరిమళించేవి కొన్ని.. 

పరవశాన్నిచ్చేవి కొన్ని.. 

  ఎన్నని ఎంచను..

వేటిని తుంచను.. 

  పరిమళించేవి నీ సుగుణాలైతే.. 

పరవశింపజేసేవి నీ ఆలోచనలే.. 

  పూలురాలే వసంతమొచ్చేది.. 

ఉన్న పూలను రాల్చడానికా..

  లేక కొత్త పూత పూయించడానికా..

నీ చెలిమీ నాకంతే..!!

  నిరాశ నీరదాలు..

నన్నావహించినప్పుడు..

  విధిరాత మొత్తం నా పై..

ఎదురుదాడి చేసినప్పుడు.. 

  కత్తుల్లాంటి నీ మాటలే..

వాటిని తుంచేస్తాయి..

  మరల.. మరల.. ఆ మాటలే

నాలో కొత్త ఆశల

  చిగుళ్లు పూయిస్తాయి.. 

అందుకే.. 

  మన స్నేహ వసంతాన్ని 

పాటలా ఆలపించే

  నల్లని కోయిలనవుతా..

నిత్యం నీతో ఉండే..

  నీ నీడనౌతా...!! 



24, జూన్ 2020, బుధవారం

భయమా.. ఏది? చిరునామా

  •  "మనిషి మారలేదు ఆతని ఆశ తిరలేదు" అని గుండమ్మకధ సినిమాలో ఎన్టీఆర్, సావిత్రి పాడిన పాటలో అర్ధం మానవ మనుగడ మొదలైనాక ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరిగి.. తద్వారా సాధించిన విజయాలు చవిచూసి కూడా మనిషిలోని నవీన తృష్ణ తీరలేదని.. ఇక్కడవరకూ బాగానే ఉన్నా... ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో విపత్తులొచ్చినా... వైపరిత్యాలొచ్చినా.. భయమనే శభ్దాన్ని మనిషి తన నిఘంటువులోంచి తొలగించాడేమో అనిపిస్తుంది. పై రెండింటి వల్ల మహా అయితే ఎంతోకొంత ఆస్తినష్టం జరుగుతుంది. అప్పుడు కష్టపడో..లేకుంటే ఇన్సూరెన్స్ వల్లో మరల నష్టపోయిన ఆస్ధిని తిరిగి సంపాదించుకోవచ్చన్న ధైర్యం వల్ల భయాన్నొదిలేయడం తప్పు కాదు.  కానీ!  కరోనా కష్టకాలంలో మనిషికి ప్రాణహాని ఉందని తెలిసి కూడా భయపడటంలేదు. మన ప్రక్కనే కరోనా సమస్యొచ్చినా కూడా నిర్లక్ష్యంగా వేడుక చూడటానికెళ్ళినట్టు సరైన జాగ్రత్తలు పాటించకుండా వెళ్ళిచూసొస్తున్నారు.. వెంట కరోనా తెస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా.. ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎవరూ లక్ష్యపెట్టకపోవడం చేతనే ఈ మధ్య కేసులు పెరిగిపోతున్నాయేమో.. ఏంచేస్తే భయమొస్తుంది.  సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులిస్తున్న సందేశాలు చూస్తూ.. స్పందించి.. ప్రశంశించడంలో ముందుంటున్నారు కానీ! అందులో ఉన్న సందేశాన్ని గ్రహించి ఆచరించడంలో మాత్రం ఎవరూ సుముఖత చూపించడంలేదు. ప్రతీ ఒక్కరికీ వ్యాపారదృక్పధం అలవాటవ్వడం వల్ల అంత పెద్ద విపత్తు ని చాలా తేలికగా తీసుకుంటున్నారేమో..  ఏమైనా..  సర్వేజన సుఖినోభవంతు అని కోరుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం 🙏🙏🙏

20, జూన్ 2020, శనివారం

సేవా ప్రచార వ్యాపారం


  • జంధ్యాలగారి "ఆహ! నా పెళ్ళంట" సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ ఒకటి "కొంతమంది ఇంత సాయంచేసి అంత పేరేసుకుంటారు. కానీ నాకలాంటివి సుతరామూ నచ్చవు..నాకు గుప్తధానాలే అలవాటు". అని! ఆ అంశం హాస్యానికి వాడుకున్నప్పుడు జంధ్యాలగారు ఊహించి ఉండరు మున్ముందు ఆయన చెప్పినట్టు సేవ చేసి పేర్లేసుకుంటారని. తమిళతంబిలకు ఒక అలవాటుంది "ఏ చిన్న కార్యక్రమం జరిగినా వాళ్ళకు సంభందించిన నాయకుడు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఫ్లెక్సీలు కట్టడం". మన వాళ్ళకూ ఒక అలవాటుంది "ఫలానావాడు మన ఊళ్ళో బియ్యం పంపిణీ చేస్తున్నారు.. మన వార్డులో కూరగాయలు, పండ్లు పంచారట అని తెలిసేలా ఫ్లెక్సీలు కట్టి మరీ ప్రచారం చేసుకోవడం". వాళ్ళు చేస్తున్నారు..వేసుకుంటున్నారు. నీకేంటి కష్టం అని అనుకుంటున్నారా? అసలు ఈ సృష్టిలో మనకు  ప్రకృతి చేసినంత నిస్వార్ధ సేవ మరే జీవి చేయదేమో!  అవును...  చెట్టు మనమడకుండానే గాలిస్తుంది... మొక్క మనమడగకుండా పూలిస్తుంది.. ఆవు మనమడగకుండా పాలిస్తుంది.. కానీ!  పైవేవీ కూడా వాటిని అనుభవించేవాళ్ళు.. ఆస్వాధించేవాళ్ళు తమను గుర్తించాలని కోరుకోవు. అంతదాకా ఎందుకు!  మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అపర అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు చేసిన నిరతాన్నధానం గురించి ఆవిడ చేతిముద్ద తిన్నవాళ్ళు చెప్పుకున్నారు కానీ, ఆవిడ ఏనాడు ప్రచార ఆర్భాటం కోరుకోలేదు. అదీ! సేవంటే.. అదీ నిస్వార్ధమంటే. కుడి చేత్తో చేసిన ధానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని మన పూర్వీకుల మాట. ఇప్పుడు సేవంటే అది కూడా ఒక రకమైన వ్యాపారం మాత్రమే.. ఇంత డబ్బు పెట్టుబడిపెట్టి జనాలు దృష్టి(focus)ని కొనుక్కంటున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలంటేనో..ఆదాయపు పన్ను  మినహాయింపు కోసమో సేవాతత్పరతను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన మార్పలు మున్ముందు ఇంకెన్ని చూడాలో...

19, జూన్ 2020, శుక్రవారం

ఆత్మబంధువు

త్మబంధువు..
  • ఎవరీ ఆత్మబంధువు.. తెలుసా? మన రక్తం పంచుకోకపోయినా.. మన బాధలను పంచుకునేవాడు.. మన ప్రత్యక్షంలో మనల్ని తిట్టేవాడు.. మన పరోక్షంలో మనల్ని పొగిడేవాడు. మన తప్పులను భరించేవాడు... ఎప్పటికీ మన అని అనుకోవాలనిపించేవాడు..  మన మాట మన దగ్గరే వదిలేసేవాడు.. ప్రత్యేకించి మన మనసును నమ్మకమంచున ఉంచేవాడు... ఇలాంటివాడు మన ఆత్మబంధువు కాకింకేమౌతాడు.. వాడిని స్నేహితుడని కాకింకేమంటారు.. అలాంటి ఆత్మబంధువు ఉన్నవాడు అదృష్టవంతుడు కాకింకేమౌతాడు.. అనుబంధం మధ్యలో లెక్కల ముడి వేసేవాడు వ్యాపారి తప్ప ఆత్మబంధువు కాలేడు.. వాడిని ఆత్మబంధువని.. ఆత్మవంచన చేయలేము.. ముఖాన నవ్వు రంగు పులమలేము.. ఎప్పటికీ అలాంటి ఆత్మబంధువులు మనకుండాలి.. మనమూ మరొకరికాత్మబంధువవ్వాలి.. మన జీవితాలు నిశ్చింతగా సాగాలి..😁😁😁నిత్యమిలా ఇలా నవ్వులు విరభూయాలి.

18, జూన్ 2020, గురువారం

వర్మ నా గురువు

  • అయాన్
    రాండ్  సిధ్దాంతాలను అవుపోసన పట్టిన వింత జీవి ..మా అర్జీవీ..నా గురువే. మూసలోపోసిన తెలుగు సినిమాకి కొత్త నడకను నేర్పిందితను..పోతపోసిన నవీనతకు నిలువెత్తు రూప‌మితను.. ఎందరో ఔత్సాహికులకు.. యువసాంకేతిక నిపుణులులకు ప్రేరణితను.. ఇతను చెప్పింది వేదాంతమా..లేక సిధ్ధాంతమా అని తలలు పీక్కోగా.. పీక్కోగా... ఆ రెండూ కాదు అదొక తత్వం అని అర్ధమయ్యేలోపే అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇంత చెప్పినా వాడొక పిచ్చోడనుకునే వాళ్ళున్నా వర్మ నా గురువే. అతనిశైలిలోనే చెప్పాలంటే అతడు" స్వార్ధాన్ని శ్వాసించే నిస్వార్ధపరుడు.. నిస్వార్ధంగా జీవించే స్వార్ధపరుడు". తనకు నచ్చకపోతే తలపండిన వాళ్ళను సైతం తల్లో పెనులా తీసిపాడేస్తాడు.  మోహమాటపు ముసుగు కప్పుకొని ఎవరికీ లేని మర్యాద చూపించి ఎవరి మెప్పు కోసం బ్రతకడు.ఇది కొంతమందికి పిచ్చనిపించొచ్చు..మరికొంతమందికి పొగరనిపించొచ్చు.. కానీ!అది అతని ఇజం... రామూఇజం..

17, జూన్ 2020, బుధవారం

జీవించేదెలా? నిత్యం పోరాటయోధుడిలా!

  • జీవించాలి
    ... కులాశాగా .. ప్రశాంతంగా..! ప్రవాహంలా ఆనందం పరవళ్ళు తొక్కుతూ వస్తుంటే ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆస్వాధిస్తూ అనుభవించాలి. బ్రతుకు కిటికీలోంచి తాపీగా.. తాయితీగా..జీవనపయనాన్ని ఆస్వాధిస్తూ బతుకు బండిని నెట్టుకెళ్ళిపోవాలి. అయ్యే పనులేనా?.. ప్రస్తుతం యాంత్రికంగా మారిన జీవనవిధానంలో. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం... ప్రతీ ఉదయం.. ప్రతీ రాత్రీ... ఆనందాన్ని వాయిదా వేసేసి.. దేనికోసమీ వెంపర్లాటని.. దేనికోసమీ మనసు వెతుకులాటని..! అనుకుంటూ వెతికీవెతికీ వేసారి అలసి ఎప్పటికో కలల గుర్రాల సవారి చేస్తూ నిద్రసామ్రాజ్యం చేరుకుని చుట్టూ ఉన్న కొత్త లోకాన్ని చూస్తూ హమ్మయ్యా అనుకుంటుండగా..!  ఏదో అలికిడి.. తీరా కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.. అది మరలా మనల్ని తరుముకుంటూ నిద్రలేపడానికొచ్చిన సమయమని.మరలా మామూలే. రోజు తెల్లారింది. మరల సమరానికి సమాయత్తమవ్వాలి కుళ్ళూ..కుతంత్రాల ఆయుధాలను సానపెడుతూ..!! 

31, మే 2020, ఆదివారం

వెన్నెల పొలిమేర -- వెలుగు నా వెండితెర


కధలెెెెెన్నో.. కలలెెెన్నో..
కల్పనలెన్నో.. కావ్యాలెన్నో.. 
వెతలెన్నో.. వ్యధలెన్నో.. 
భావాలెన్నో.. భావోద్వేగాలెన్నో.. 
ఇన్ని కలగలిసిన వెలగుల చీర..
చల్లని వెన్నెల నా వెండితెర..
తాతలనాడు పుట్టినా..
తండ్రుల తరం చుట్టినా..
ప్రతీ తరానికి నువ్వే కదా నేస్తం.. 
ఎందరికో నేస్తానివి.. 
నాబోటోళ్ళకి ప్రేయసివి.. 
కరోనాకోరల్లో చిక్కుకుని
ఇన్నాళ్ళకు విరామం తీసుకుని.. 
మా గుండెల్లో విరహపు బడభాగ్ని రేపావు.. 
ఏనాటి బంధమిది
నేస్తమా నీది-నాది. 







అనుభవాలసారమే జీవితం. పుట్టుకనుంచి చావు వరుకు ఎన్ని భావోద్వేగాలు. క్షణికం ఈ జీవితమని తెలుసు.. కానీ క్షణం కూడా ఆగని ఆరాటమే కదా మన జీవన పోరాటం. ఎన్నిసార్లయినా పడిలేస్తాం సాగర కెరటంలా..  ఆశ! మనిషిని నడిపించే సాధనం. అర్ధంలేని అర్ధమే జీవిత చక్రాలను నడిపించే ఇంధనం.ఆశ చావదు.. డబ్బు చాలదు.. బ్రతుకు సాగదు.చెప్పడానికి నామోషీ..నవ్వుకేమో నగిషీ..గుండె చప్పుడు ఎగసెగసీ ఎన్నాళ్ళు సాగుతుందో బ్రతుకు పయనం.క్షణం నవ్వు.. క్షణం కుట్ర
..క్షణం బాధ..క్షణం కుతంత్రం.. అంతలో గుర్తొస్తుంది మానవత్వం..అరెరే! ఇది తప్పు కదా..అనిపిస్తుంది..బ్రతకాలంటే తప్పదనిపిస్తోంది.. 

Winning Together | NRK’s Heart Talks