27, సెప్టెంబర్ 2020, ఆదివారం

మళ్ళీ అలా ఎవరు పాడతారయ్యా..!

 


                          డిచిన రెండు రోజులు నుంచి ఒకటే ఆవేదన. అన్నమయ్య సినిమా పతాక సన్నివేశమే కళ్లలో మెదులుతున్నట్టుంటుంది. అందులో భగవంతుడికీ.. భక్తునికీ మధ్య జరిగే సంభాషణ.. సంఘర్షణ ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళుతుంది. ఇదిగో స్వామీ నీ సొత్తు... "దాచుకో... నీ పాదాలకు ధరణే చేసిన పూజలివి..పూచీ.. నీ కీరితి ధూప పుష్పములివె అయ్యా.. దాచుకో..దాచుకో..! " అంటూ అన్నమయ్య సమర్పించిన భక్తి పుష్పాలను స్వీకరిస్తూ.. స్వామి అడుగుతారు.. దాచుకుంటానులే కానీ!  ఏవిటీ.. అప్పుడే లెక్కలప్పజెబుతున్నావ్.. అని. దానికన్నమయ్య "అప్పుడే ఏమిటి స్వామీ..! ఈ కట్టే పుట్టి తొంభై రెండేళ్ళు గడిచిందంటాడు.. దానికి స్వామి "అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి.. మాలాగ నిత్యం యవ్వనంతో ఉండేలా వరమనుగ్రహిస్తాం అంటారు.  దానికన్నమయ్య.. నటనా సూత్రధారి..! పరమపద సోపానపు ఆటలో.. ఆశల నిచ్చెనలు ఎక్కించడం.. కోర్కెల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే .. హా! ఇంకా ఈ దేహం పై మోహం ఉందా.. లేదా.. అని పరీక్షిస్తున్నావ్  కదూ అంటే. స్వామి కాదు..  నీ పాట మీద మాకున్న వ్యామోహం.. నువ్వెళ్ళిపోతే మళ్ళీ అలా ఎవరు పాడతారయ్యా.. అని అంటారు..  సరిగ్గా ఇలాంటి సంవాదమే భగవంతుడికీ.. బాలూగారికీ జరిగి చివరికి బాలూగారే జయించి వెళ్ళిపోయుంటారు... 

             " కొత్తనీటి రాక.. పాతనీటి పోక " ఏ రంగంలో అయినా తప్పదు. అయితే తరాలు మారుతూ ఉంటాయి.. విధానాలు మారుతుంటాయి. పోయే తరానికి.. వచ్చే తరానికి మధ్య వారధిలా ఉండి, తమ అనుభవాలనూ.. జ్ఞాపకాలనూ..అటు పెద్దరికంగా.. ఇటు స్నేహపూర్వకంగా.. పంచుకునేవాళ్ళు చాలా తక్కువమందుంటారు. బహుశా..!  అలాంటివారిలో బాలూగారు ముందువరుసలో ఉంటారనుకుంటా. అవును, పాశ్చాత్యపు పోకడలు సినీ సంగీతంలో మొలకెత్తినప్పటి నుండీ ఆయన సినీ పాటలు పాడటం తగ్గించి.. అడపాదడపా పాటలు పాడినా, ఆయన సామాజిక బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు అనిపిస్తుంది ఆయన జీవనచిత్రాన్ని చూస్తే..! కొన్ని మాటలు ఆయన నోటితో చెబితేనే బాగుంటుంది.. కొన్ని పాటలు ఆయన స్వరంలో వింటేనే బాగుంటుంది. ఆయన టీవీలో కనిపించే కార్యక్రమం ఏదైనా ఆయన కోసమే విక్షంచాలనిపించేది

                   స్వరాభిషేకం కార్యక్రమం విజయం మొత్తం బాలూగారికే సొంతం. పాడుతూ తీయగా ద్వారా ఎందరో గాయనీ గాయకులను తయారుచేసి.. తనకన్నం పెట్టిన సంగీత సరస్వతి రుణం తీర్చుకున్నారేమో. ఆయన తన తరువాత తరానికి సంగీతంతో పాటు.. సంస్కారాన్ని.. మర్యాదను నేర్పించారు. నిజానికి ఈ నిష్క్రమణం బాలూగారిది కాదు.. తెలుగు భాషది.. ఎందుకంటే తన పాటలతో కొన ఊపిరితో ఉన్న తెలుగు భాషకు ప్రాణం పోశారు బాలూగారు . అంత స్పష్టమైన ఉచ్ఛారణ.. పాటలో భావ ప్రకటన ఉన్న గాయకులు ఇక లేరనడంలో అతిశయోక్తి లేదేమో. ఆయన పాటలున్నంత కాలం.. వినపడినంత కాలం.. తెలుగు  భాష బ్రతికే ఉంటుందని ఆశిద్దాం.. బాలూగారికి నివాళులర్పస్తూ.. 

                   

Winning Together | NRK’s Heart Talks